ధోనీకి షాక్.. తన టీ20 ప్రపంచకప్‌ జట్టులో మాజీ సారథికి చోటివ్వని లక్ష్మణ్

09-01-2020 Thu 09:59
  • తన కలల జట్టును కూర్చిన వీవీఎస్ లక్ష్మణ్
  • ధోనీ, ఓపెనర్ శిఖర్ ధవన్‌లకు దక్కని చోటు
  • రిషభ్ పంత్, యువ ఆటగాడు శివం దూబేలకు చోటు

హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి షాకిచ్చాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన తన కలల జట్టులో ధోనీకి చోటివ్వలేదు. అలాగే, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్‌ను కూడా ఎంపిక చేయకపోవడం గమనార్హం.

ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సందర్భంగా లక్ష్మణ్ తనన కలల జట్టును కూర్చాడు. కొత్త కుర్రాడు శివం దూబే, విమర్శలు ఎదుర్కొంటున్న కీపర్ రిషభ్ పంత్‌లకు లక్ష్మణ్ చోటివ్వడం గమానార్హం. కాగా, ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ భవిష్యత్తుపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో ఆడతాడని కొందరు, లేదని కొందరు అంటున్నారు. అయితే, ధోనీ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.

లక్ష్మణ్ ఎంపిక చేసిన టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మనీశ్ పాండే, శివం దూబే, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్