హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ వద్ద భారీ భద్రత

09-01-2020 Thu 09:43
  • బేగంపేటలోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద భారీ భద్రత
  • పహారా కాస్తున్న సాయుధ భద్రతా బలగాలు
  • అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తం

హైదరాబాద్‌, బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొని ఉండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం దౌత్య కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ప్రత్యేక సాయుధ భద్రతా దళాలను నియమించింది. అంతేకాదు, దౌత్యకార్యాలయం మీదుగా వెళ్లే వాహనాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

తమ సైనికాధికారిని అమెరికా హతమార్చిన తర్వాత ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్.. ఇప్పటికే ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేయగా, 80మంది హతమయ్యారు. ఇది ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. అమెరికా దౌత్యకార్యాలయం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించింది.