'దర్బార్' సూపర్ హిట్టట... ఫ్యాన్స్ హంగామా!

09-01-2020 Thu 08:30
  • నేడు విడుదల అయిన 'దర్బార్'
  • మైండ్ గేమ్, యాక్షన్, కామెడీల మిక్స్
  • ట్విట్టర్ లో వెల్లువెత్తుతున్న కామెంట్స్

'కబాలి', 'కాలా', '2.O', 'పేట్టా' సినిమాల తరువాత సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'దర్బార్' చిత్రం ఈ ఉదయం థియేటర్లను తాకగా, ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా చాలా అద్భుతంగా ఉందని, రజనీ మరోసారి మ్యాజిక్ చేశారని, చిత్రం సూపర్ హిట్ అని తాజా టాక్. రజనీ సరసన నయనతార, నివేదా థామస్ లతో పాటు బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్ తదితరులు ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

అభిమానులు, సినీ ప్రేక్షకులు రజనీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్న దర్శకుడు మురుగదాస్, మైండ్ గేమ్ తో పాటు, ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాను రసవత్తరంగా తెరకెక్కించారని కితాబులు వస్తున్నాయి. ఎంతో కాలం తరువాత రజనీలోని అసలైన హీరోయిజం బయట పడిందని ట్విట్టర్ లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రజనీ ఎంట్రీ నుంచి ప్రతి సీన్ సూపర్బ్ గా ఉందని చెబుతున్నారు.

ఇక రజనీని చూడటానికి రెండు కళ్లూ చాలవని, యాక్షన్, కామెడీ కాక్ టెయిల్ మిక్స్ గా సినిమా తయారైందని, ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అని ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు.