marriage: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పిల్లల తల్లిని మోసం చేసిన యువకుడు

  • భర్త హింసిస్తుండడంతో పుట్టింటికి మహిళ
  • ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న యువకుడు
  • పెళ్లి చేసుకుంటానని ముఖం చాటేసిన వైనం

ఫేస్‌బుక్‌లో పరిచయమై పెళ్లి చేసుకుంటానని పిల్లల తల్లిని నమ్మించి మోసం చేసిన యువకుడికి పోలీసులు బేడీలు వేశారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నాచారం ప్రాంతానికి చెందిన ఓ మహిళ (23)కు ఐదేళ్ల బాబు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. నాలుగు నెలల క్రితం భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమెను తరచూ వేధిస్తుండడంతో భరించలేని ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది.

ఈ క్రమంలో ఫేస్‌బుక్ ద్వారా ఆఫన్ అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఆఫన్ జవహర్‌నగర్‌లో ఉంటూ కుక్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాధిత మహిళకు జవహర్‌నగర్‌లో ఓ ఇంటిలో పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో ఆమెను కలుసుకున్న నిందితుడు పెళ్లి చేసుకుంటానని, ఆమె పిల్లలకు తండ్రిగా ఉంటానని నమ్మించాడు.

ఆ తర్వాతి నుంచి ఆమె పనిచేస్తున్న ఇంటికి తరచూ వచ్చేవాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని పట్టుకుని నిలదీశారు. దీంతో ఆమెను పెళ్లాడతానని వారికి మాటిచ్చాడు. అనంతరం అటువైపు రావడం మానేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని నిన్న అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

More Telugu News