Bihar: కానిస్టేబుల్ ముఖంపై వేడినీళ్లను పోసిన డీఐజీ స్థాయి అధికారి!

  • బీహార్‌లోని రాజ్‌గిరి సిటీలో ఘటన
  • ముఖం, శరీరం కాలిపోయి విలవిల్లాడిన కానిస్టేబుల్ 
  • తీవ్రంగా పరిగణించిన సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు

డీఐజీ స్థాయి అధికారి ఒకరు కానిస్టేబుల్‌పై ప్రతాపం చూపారు. తాగేందుకు నీళ్లు తీసుకొచ్చిన కానిస్టేబుల్‌పై మండిపడుతూ అతడు తెచ్చిన వేడివేడి నీటిని ముఖంపై విసిరికొట్టాడు. దీంతో కానిస్టేబుల్ ముఖం కమిలిపోయింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీహార్‌లోని రాజ్‌గిరి సిటీలో ఈ నెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సీఆర్‌పీఎఫ్‌లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పనిచేస్తున్న డీకే త్రిపాఠీ తనకు నీళ్లు కావాలని అడగడంతో కానిస్టేబుల్ అమోల్ కారత్ వేడినీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. వేడి నీళ్లు చూసి ఆగ్రహంతో ఊగిపోయిన త్రిపాఠీ ఆ నీటిని కానిస్టేబుల్ ముఖంపై పోశాడు. వేడినీళ్లు బలంగా వచ్చి ముఖాన్ని తాకడంతో కానిస్టేబుల్ విలవిల్లాడిపోయాడు. ముఖం, శరీరం కమిలిపోవడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు త్రిపాఠీని విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను రేపటి లోగా అందించాలని ఆదేశించారు.

More Telugu News