రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. జాతీయ రహదారుల సంస్థపై కేసు పెట్టిన కుమారుడు!

09-01-2020 Thu 07:23
  • వరంగల్ రూరల్ జిల్లాలో ఘటన
  • కల్వర్టుకు ఢీకొని తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు
  • అధికారుల నిర్లక్ష్యమే తన తల్లి ప్రాణం తీసిందని కుమారుడి ఆవేదన

తన తల్లి మరణానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) కారణమంటూ ఓ యువకుడు కేసు పెట్టాడు. రోడ్డు నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే తన తల్లి మృతి చెందిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌కు చెందిన దంపుల ఆదిరెడ్డి, భార్య సౌందర్యతో (55)తో కలిసి ఆదివారం హన్మకొండలో పనిచూసుకుని బైక్‌పై తిరిగి గ్రామానికి బయలుదేరాడు. దామెర మండలంలోని ఒగ్లాపూర్ సమీపంలోకి రాగానే ఇరుకైన కల్వర్టును ఢీకొని పక్కనే ఉన్న గుంతలో పడిపోయారు.

తీవ్రంగా గాయపడిన దంపతులిద్దరినీ వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సౌందర్య పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సౌందర్య కన్నుమూసింది. తన తల్లి మృతికి ఎన్‌హెచ్ఏఐ కారణమని, కల్వర్టు నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించలేదని, ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయలేదని బాధితురాలి కుమారుడు జైపాల్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. అధికారుల నిర్లక్ష్యమే తన తల్లి ప్రాణాలు తీసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.