లోకేశ్‌కు పరామర్శ అని పలకడం కూడా రాదు!: ఏపీ మంత్రి కన్నబాబు

09-01-2020 Thu 06:52
  • లోకేశ్ కూడా విమర్శలు చేస్తున్నారు
  • అమరావతిలో ఆందోళనలన్నీ బాబు ప్రేరేపితాలే
  • రాజధానిపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు

మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్‌పై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. లోకేశ్‌కు పరామర్శ అని కూడా పలకడం రాదని అన్నారు. అందుకు బదులు పరవశించానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పరామర్శ అనే పదాన్ని సరిగా పలకలేని లోకేశ్ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపైనా కన్నబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి విషయంలో జరగుతున్న ఆందోళనలన్నీ ఆయన ప్రేరేపితాలేనని అన్నారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆయన చేయిస్తున్నవేనని ఆరోపించారు. రాజధాని గురించి మాట్లాడే అర్హత, హక్కు చంద్రబాబుకు లేవన్నారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణలపై సలహాలు ఇవ్వాల్సిన చంద్రబాబు విద్యార్థులను, రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు.