తీసుకున్న నిర్ణయం సరైనది అయితే బస్సు యాత్ర అనగానే ఎందుకంత భయం?: నారా లోకేశ్

08-01-2020 Wed 21:44
  • బస్సు యాత్ర చేపట్టిన అమరావతి జేఏసీ, రైతులు
  • బస్సు యాత్ర ప్రారంభోత్సవంలో తీవ్ర ఉద్రిక్తతలు
  • చంద్రబాబు తదితరులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • జగన్ ను ప్రశ్నించిన నారా లోకేశ్

రాజధాని మార్పును నిరసిస్తూ అమరావతి జేఏసీ, రైతులు చేపట్టిన బస్సుయాత్ర ప్రారంభోత్సవం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విజయవాడలో బెంజ్ సర్కిల్ వద్ద చంద్రబాబు సహా ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

 దీనిపై నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. తీసుకున్న నిర్ణయం సరైనదే అయితే బస్సు యాత్ర అనగానే వైఎస్ జగన్ కు ఎందుకంత భయం పట్టుకుందని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో బస్సులను ఆపగలరేమో కానీ ప్రజల భావోద్వేగాలను ఆపలేరని ట్వీట్ చేశారు. రైతుల కోసం ఎన్నిసార్లు అయినా జైలుకెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని, తాము జగన్ లా ప్రజల సొమ్ముతిని జైలుకు వెళ్లలేదని విమర్శించారు. తాము రైతుల పక్షాన నిలిచి జైలుకు వెళుతున్నామని తెలిపారు.