చంద్రబాబును ఎక్కించిన పోలీస్ వాహనం ‘కీ’ మాయం!

08-01-2020 Wed 21:25
  • పోలీస్ వాహనం ‘కీ’ను ఎత్తుకుపోయిన గుర్తుతెలియని వ్యక్తులు
  • తాళం లేకుండానే వాహనాన్ని స్టార్ట్ చేసే యత్నం
  • బెంజి సర్కిల్ వద్ద నిలిచిన ట్రాఫిక్

విజయవాడలో బస్సుయాత్ర ప్రారంభించేందుకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు, అఖిలపక్ష సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే, చంద్రబాబు సహా పలువురు నేతలను ఎక్కించిన పోలీస్ వాహనం ‘కీ’ మాయమైంది. దీంతో, వాహనం అక్కడే నిలిచిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ‘కీ’ని పట్టుకుపోయినట్టు తెలుస్తోంది. తాళం లేకుండానే వాహనాన్ని స్టార్ట్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఆ వాహనం కదిలింది.

కాగా, చంద్రబాబుకు సంఘీభావంగా పరిసర ప్రాంతాలు ప్రజలు తరలివస్తున్నారు. దీంతో, స్థానిక బెంజి సర్కిల్ వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద జనసందోహం నెలకొంది. కాగా, పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ, జేఏసీ నేతలను ఏఏ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారన్న విషయం తెలియరాలేదు.