విశాఖను రాజధాని చేయాలని అక్కడి ప్రజలు ఎప్పుడైనా అడిగారా?: టీడీపీ అధినేత చంద్రబాబు

08-01-2020 Wed 21:07
  • రైతుల ఆందోళనను ఎందుకు పట్టించుకోవడంలేదు?
  • దౌర్జన్యం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు
  • రాజధాని కోసం ఎన్ని కమిటీలు వేస్తారు?

రాజధాని తరలింపుపై రైతులతో కలిసి బస్సు యాత్రకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చంద్రబాబు దుయ్యబట్టారు. పోలీసుల దమనకాండను నిరసించారు. అంతకు ముందు అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో చంద్రబాబు పాల్గొంటూ జగన్ సర్కార్ పై కీలకమైన విమర్శలను సంధించారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన జేఏసీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రైతులు చేస్తోన్న ఆందోళనను జగన్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తమపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రాజధాని కావాలని విశాఖ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా? అని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజధాని కోసం ఎన్ని కమిటీలు వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.