Sony: కాన్సెప్ట్ కారు తయారు చేసిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ... సంభ్రమాశ్చర్యాల్లో మార్కెట్ వర్గాలు!

  • విజన్ ఎస్ పేరుతో ఎలక్ట్రిక్ కారు తీసుకువస్తున్న సోనీ
  • ఎలక్ట్రానిక్స్ ఎక్స్ పోలో ప్రదర్శన
  • అవాక్కయిన సందర్శకులు

ప్రపంచంలో నాణ్యమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తయారుచేసే సంస్థగా సోనీకి తిరుగులేని ఇమేజ్ ఉంది. జపాన్ లో ఆరంభమై దాదాపు అన్ని దేశాల్లో విస్తరించిన సోనీ... టెలివిజన్ లు, ఆడియో, వీడియో, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల తయారీలో మేటిగా కొనసాగుతోంది. అయితే, ఆశ్చర్యకరంగా సోనీ కార్ల తయారీ రంగంలో అడుగుపెట్టింది. అది కూడా ఓ కాన్సెప్ట్ కారుతో రంగంలో దిగింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లదే హవా అని నిపుణులు చెబుతున్న తరుణంలో సోనీ సరికొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ కారు రూపొందించింది.

అమెరికాలోని లాస్ వేగాస్ లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) లో సోనీ తన విద్యుత్ ఆధారిత కారును ప్రదర్శించింది. సోనీ నుంచి ఇలాంటి ఉత్పత్తి వస్తుందని ఊహించని మార్కెట్ నిపుణులు, సందర్శకులు అవాక్కయ్యారు. ఈ కారుకు 'విజన్ ఎస్' అని నామకరణం చేశారు. ఈ కారులో ప్రతి సీటుకు రెండు స్పీకర్లు అమర్చారు. కారులో మొత్తం 33 స్పీకర్లు ఏర్పాటు చేసి సోనీ తన ప్రత్యేకత చాటుకుంది. దీన్ని సోనీ 360 డిగ్రీ రియాలిటీ ఆడియో అనుభూతిగా పేర్కొంటోంది.  

అంతేకాదు కారుకు అడ్డంకిగా మారే ఏదైనా వస్తువును గుర్తించే 'సేఫ్టీ కకూన్' వ్యవస్థను పొందుపరిచారు. ముందు వైపు 500 గజాలు, మిగిలిన మూడు వైపులా 250 గజాల పరిధిలో కారుకు ఎలాంటి అవరోధాలు ఉన్నా ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. అంతేకాదు, కేవలం 4.8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. మాగ్జిమమ్ స్పీడ్ గంటకు 240 కిలోమీటర్లు.

More Telugu News