బస్సుయాత్రకు ఆటంకం.. చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు

08-01-2020 Wed 20:34
  • బస్సుయాత్ర చేయకుండా అడ్డుకున్న పోలీసులు
  • పోలీసుల అదుపులో పలువురు నేతలు
  • చంద్రబాబును, ఇతర నేతలను బలవంతంగా తరలింపు

విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా అమరావతి పరిరక్షణ సమితి నేతలను, వివిధ పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. పోలీస్ వాహనంలో వారిని తరలిస్తున్నారు. చంద్రబాబుతో పాటు అదుపులోకి తీసుకున్న వారిలో నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కేశినేని నాని, రామానాయుడు, అశోక్ బాబు, అఖిలపక్ష నేతలు ఉన్నారు.  

విజయవాడలోని స్థానిక బెంజి సర్కిల్ వద్ద ఉన్న వేదిక కల్యాణ మంటపం వద్ద నుంచి బస్సు యాత్రకు బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై చంద్రబాబు సహా పలువురు నేతలు ప్రతిఘటించారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబును అదుపులోకి తీసుకుని, ఆయన వాహనంలోనే తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

కాగా, వేదిక కల్యాణ మంటపం ప్రధాన గేటు నుంచి చంద్రబాబు సహా నేతలు బయటకొస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు.144 సెక్షన్ అమలవుతున్న కారణంగా స్థానిక గురునానక్ కాలనీ వద్దకు పాదయాత్ర ద్వారా వెళ్లేందుకు అనుమతి లేదని వారికి పోలీసులు చెప్పారు. బస్సుయాత్రను ప్రారంభించేందుకు వెళుతున్నామని, శాంతియుత మార్గంలోనే ముందుకు సాగుతున్నామని పోలీసులకు చెప్పినా వారు వినిపించుకోలేదని సమాచారం.