‘ప్రతి రోజు పండగే’ దర్శకుడు మారుతికి ప్రత్యేక బహుమతి

08-01-2020 Wed 19:53
  • రేంజ్ రోవర్ కారును బహూకరించిన నిర్మాత వంశీ
  • అనూహ్య కలెక్షన్లు రాబట్టడంతో నిర్మాతల అనందం
  • 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.32.29 కోట్లు వసూళ్లు

‘ప్రతి రోజు పండగే’ చిత్రం దర్శకుడు రేంజ్ రోవర్ కారు బహుమతి అందుకుని పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా అనూహ్యంగా బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబడుతూండటంతో చిత్ర నిర్మాతలు ఖుషీగా వున్నారు. విడుదలైన 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.32.29 కోట్ల వసూళ్లను చేసింది. హీరో సాయిధరమ్ కెరీర్ కు కూడా ఊపునిచ్చిన చిత్రంగా మారింది.తొలి వారంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా సాయిధరమ్ కెరీర్ లో నిలిచింది.

ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రం అనూహ్య విజయాన్ని సాధించిన నేపథ్యంలో సహ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మాత వంశీ దర్శకుడు మారుతిని ప్రశంసిస్తూ.. ఆయనకు రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. దీంతో మారుతి ఆనందం పట్టలేకపోయారు. వంశీకి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ‘ధన్యవాదాలు వంశీ డార్లింగ్, నీలాంటి స్నేహితుడు ఉంటే ప్రతి రోజూ పండగే’ అని తన సందేశంలో పేర్కొన్నారు. కారును స్వీకరిస్తూండగా తీసిన ఫొటోను కూడా మారుతి పోస్ట్ చేశారు.