కొరటాల శివ అనవసరంగా బుక్కయ్యారు: అనిల్ రావిపూడి

08-01-2020 Wed 19:13
  • విడుదలకు సిద్ధమైన సరిలేరు నీకెవ్వరు
  • ప్రమోషన్ కార్యక్రమాలలో యూనిట్ బిజీ
  • ఐదు నెలల్లో సినిమా తీయడం అంత ఈజీ కాదన్న దర్శకుడు 

మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజవుతోంది. ప్రస్తుతం మహేశ్ బాబు, రష్మిక, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి హాజరైన సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి చెబుతూ, దర్శకుడు కొరటాల శివ గురించి మాట్లాడారు.

చిరంజీవి గారితో తెరకెక్కిస్తున్న చిత్రాన్ని 90 రోజుల్లో పూర్తిచేస్తానంటూ కొరటాల శివ అనవసరంగా బుక్కయ్యారని అనిల్ రావిపూడి చమత్కరించారు. ఐదు నెలల్లో సినిమా పూర్తవడం ఆషామాషీ వ్యవహారం కాదని, అన్నీ కుదరాలని తెలిపారు. తారల కాల్షీట్సు లభించడం దగ్గర్నుంచి చివరికి వాతావరణం కూడా అనుకూలిస్తేనే అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయగలమని వివరించారు. అయితే తమ సినిమాకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదని అనిల్ వెల్లడించారు.

'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన చిరంజీవి, ఆ సినిమా కేవలం 5 నెలల్లో కంప్లీట్ అయిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దాంతో తన దర్శకుడు కొరటాలను పిలిచి తన చిత్రం 90 రోజుల్లో పూర్తి చేయాలని సభాముఖంగా కోరారు. దీనికి కొరటాల శివ కూడా ఓకే చెప్పారు.