ఇరాక్ వీడి.. స్వదేశాలకు రావడానికి సిద్ధంగా ఉండండి: ఫిలిప్పీన్ ప్రభుత్వం

08-01-2020 Wed 18:48
  • అమెరికా-ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో చర్య
  • కార్గో విమానాలు, ఓడల్లో పౌరుల తరలింపు
  • ఇరాక్ లో 16 వందలకు పైగా ఫిలిప్పీన్స్ కార్మికులు

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాక్ లో పనిచేస్తోన్న తమ దేశ పౌరులను వెంటనే స్వదేశాలకు తరలండని ఆయా దేశాలు కోరుతున్నాయి. అమెరికా, ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో ఇరాక్ లో ఉన్న పలుదేశాలకు చెందిన పౌరులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు తమ పౌరులను స్వదేశాలకు రప్పించాలని యోచిస్తున్నాయి.

ఇందుకోసం, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం చర్యలు కూడా ప్రారంభించింది. తమ దేశ పౌరులను తిరిగి స్వదేశం తీసుకురావడానికి కార్గో విమానాలు, ఓడలను ఆ దేశానికి పంపుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఒక ప్రకటన చేశారు. ఫిలిప్పీన్స్ కు చెందిన సుమారు 1600 మంది కార్మికులు ఇరాక్ లో పనిచేస్తున్నారని..వారంతా వెంటనే ఆ దేశాన్ని వీడడానికి సిద్ధంగా ఉండాలన్నారు. వారిని స్వదేశం తీసుకురావడానికి మూడు కార్గో విమానాలు, పెద్ద ఓడను పంపుతున్నామని వెల్లడించారు. ఇరాక్ లోని తమ దేశానికి చెందిన కార్మికులను ముందుగా ఖతార్, లొరెంజానాకు తరలిస్తామన్నారు. అక్కడినుంచి విమానాలు, ఓడల ద్వారా వారిని ఫిలిప్ఫీన్స్ కు తీసుకొస్తామన్నారు.