మరాఠా యోధుడిలా కనిపిస్తూ.. మురికి బట్టలు ఉతికాడంటూ అక్షయ్ కుమార్ పై కేసు నమోదు

08-01-2020 Wed 18:44
  • చిక్కుల్లో పడిన బాలీవుడ్ స్టార్
  • డిటర్జెంట్ యాడ్ లో నటించిన అక్షయ్ కుమార్
  • మరాఠా సంప్రదాయాన్ని మంటగలిపాడంటూ పోలీసులకు ఫిర్యాదు

బాలీవుడ్ లో అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జించే హీరోల్లో అక్షయ్ కుమార్ ముందువరుసలో ఉంటారు. ఆయన సినిమాల ద్వారానే కాకుండా వాణిజ్య ప్రకటనలతోనూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఓ వాణిజ్య ప్రకటన అక్షయ్ కుమార్ ను చిక్కుల్లో పడేసింది. అక్షయ్ కుమార్ ఇటీవల ఓ డిటర్జెంట్ ప్రకటనలో నటించారు. అందులో అక్షయ్ ఓ మరాఠా మహారాజు పాత్రలో కనిపిస్తారు.

యుద్ధానికి వెళ్లి శత్రువులపై విజయం సాధించి తిరిగివస్తారు. అందరికీ ఘనస్వాగతం లభించినా, మహారాణి నుంచి మాత్రం అక్షయ్ కుమార్ కు చీవాట్లు పడతాయి. "మీరు బట్టలు ఇంత మురికి చేసుకుని వస్తే ఎవరు ఉతకాలి?" అంటూ మహారాణి విసుక్కుంటుంది. దాంతో అక్షయ్ కుమార్ వీరావేశంతో మురికి బట్టలన్నీ ఉతకడం ఆ యాడ్ లో చూడొచ్చు.

అయితే మహారాష్ట్రలో సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారని తెలిసిందే. ఓ మరాఠా యోధుడిలా కనిపిస్తూ ఆఖరికి మురికి బట్టలు ఉతకడం ఏంటని అక్షయ్ కుమార్ పై ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మరాఠా సంప్రదాయాలను అవమానించడమేనని ఆరోపించారు. దీనిపై ముంబయిలోని వర్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. మరి దీనిపై అక్షయ్ కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి!