మీరు ఇంటిక్కూడా రానక్కర్లేదు, నేను వస్తున్నానని చెప్పారు: చిరంజీవిపై మహేశ్ బాబు ప్రశంసల వర్షం 

08-01-2020 Wed 17:39
  • సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన చిరంజీవి
  • ఆయన రాకను తాము చిరకాలం గుర్తుంచుకుంటామన్న మహేశ్
  • చిరంజీవి తనకు ఇన్ స్పిరేషన్ అంటూ వ్యాఖ్యలు

మహేశ్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడం తెలిసిందే. చిరు రాకతో ఆ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా సాగిపోయింది. దీనిపై మహేశ్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చిరంజీవి, విజయశాంతి గార్లతో వేదికను పంచుకోవడం ఓ అద్భుతమైన అనుభవం అని అన్నారు.

"చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ను ఇన్ స్పిరేషన్ గా భావిస్తాను. ఒక్కడు చిత్రం నుంచి ఆయనతో బాగా కనెక్ట్ అయ్యాను. అర్జున్ చిత్రం సమయంలో సెట్స్ కు వచ్చారు. పోకిరీ చూసిన తర్వాత రెండు గంటలు మాట్లాడారు. సినిమా బాగుందంటే కచ్చితంగా ఆయన నుంచి ఫోన్ వస్తుంది. ఎప్పుడు మాట్లాడినా ఎంతో ఆప్యాయత చూపిస్తారు. ఆయనకు నాకు మధ్య ఏదో అనుబంధం ఉందనుకుంటాను.

'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం మూడు నెలల కిందట కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఫైట్ చిత్రీకరించినప్పుడే దర్శకుడు అనిల్ తో మన సినిమా ఈవెంట్ కు చిరంజీవి గారు వస్తే బాగుంటుందని చెప్పాను. అనిల్ కూడా 'సూపర్' అన్నాడు. ఆ తర్వాతనే చిరంజీవి గారికి ఓ మెసేజ్ పెట్టాను. ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా, 'నేను వస్తున్నాను' అంటూ రిప్లయ్ ఇచ్చారు. 'సార్ నేను ఇంటికొచ్చి కలుస్తాను' అంటూ మర్యాద కోసం చెప్పాను. కానీ ఆయన 'ఇంటిక్కూడా రానక్కర్లేదు, నేను ఫంక్షన్ కు వస్తున్నాను' అంటూ కన్ఫామ్ చేశారు. 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గారు రావడాన్ని యూనిట్ మొత్తం చిరకాలం గుర్తుంచుకుంటుంది" అని తెలిపారు.