సీఏఏను వ్యతిరేకించే వారికి బ్రేకుల్లేని బస్సులిస్తాం.. పాకిస్థాన్ వెళ్లండి: బీజేపీ ఎంపీ బండి సంజయ్

08-01-2020 Wed 17:25
  • సీఏఏకు అనుకూలంగా వరంగల్ లో ర్యాలీ, సభ
  • పాకిస్థానో, బంగ్లాదేశో లేక ఆఫ్ఘనిస్థానో వెళ్లిపొండి
  • కుహనా లౌకికవాదులకు బుద్ధిచెప్పండి

జాతీయ పౌర సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకించే వారిని బ్రేకుల్లేని బస్సుల్లో ఎక్కించి పాకిస్థాన్ కు పంపుతామని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఏఏకు అనుకూలంగా వరంగల్ లో నిర్వహించిన ర్యాలీ, సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఏఏను వ్యతిరేకించే వాళ్లకు ఇక్కడ స్థానం లేదని, అవసరమైతే, పాకిస్థానో, బంగ్లాదేశో లేక ఆఫ్ఘనిస్థానో వెళ్లిపోవాలని, కావాలంటే, విమానాలు, హెలీకాప్టర్లు, బ్రేకుల్లేని బస్సులు కూడా ఇస్తామంటూ వ్యంగ్యంగా అన్నారు. సీఏఏ చట్టానికి సంబంధించిన వాస్తవ విషయాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు తెలియజెప్పాలని, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ఈ కుహనా లౌకికవాదులకు బుద్ధి వచ్చే వరకూ ఈ తరహా ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని పిలుపు నిచ్చారు.