స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ పాలనకు రిఫరెండం కాదు: మంత్రి అవంతి

08-01-2020 Wed 17:17
  • మీడియాతో మాట్లాడిన మంత్రి అవంతి
  • వైసీపీ అన్ని చోట్లా గెలుస్తుందని ధీమా
  • రాజధానుల అంశం అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపదని వెల్లడి

త్వరలో ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ పాలనకు రిఫరెండం కాదని అన్నారు. అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అన్ని చోట్లా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబులా తమ ప్రభుత్వం పూటకోమాట చెప్పదని స్పష్టం చేశారు.

రాజధానుల అంశం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుందని తాము భావించడంలేదని పేర్కొన్నారు. రాజధాని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాజధాని రైతులకు మేలు చేసే నిర్ణయాలనే సీఎం తీసుకుంటారని అవంతి వివరించారు. రాజధానిలో తాజా పరిణామాలపై స్పందిస్తూ, ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.