మళ్లీ వస్తున్న బజాజ్ చేతక్... ఈసారి సరికొత్తగా..!

08-01-2020 Wed 17:04
  • ఒకప్పుడు మేటి స్కూటర్ గా పేరుగాంచిన చేతక్
  • కాలక్రమంలో తెరమరుగు
  • ఎలక్ట్రిక్ స్కూటర్ గా పునరాగమనం 

ఒకప్పుడు భారత ద్విచక్ర వాహన మార్కెట్లో బజాజ్ చేతక్ దే ఆధిపత్యం అంటే అతిశయోక్తి కాదు. అన్ని వర్గాల ప్రజలను అలరించిన స్కూటర్ గా చేతక్ కు ఎంతో గుర్తింపు లభించింది. అయితే కాలక్రమంలో తెరమరుగైనా, ఇప్పుడు సరికొత్తగా మళ్లీ రోడ్లపై పరుగులు తీసేందుకు సన్నద్ధమవుతోంది. బజాజ్ కంపెనీ తన పాత బ్రాండ్ చేతక్ ను ఎలక్ట్రిక్ స్కూటర్ గా మలిచింది.

ఈ కొత్త బండి జనవరి 14న మార్కెట్లోకి రానుంది. పుణేలో ప్రారంభం కానున్న అమ్మకాలను ఆపై క్రమంగా ఇతర నగరాలకు విస్తరించాలని బజాజ్ ఆటో భావిస్తోంది. అయితే బుకింగ్స్ మాత్రం స్కూటర్ మార్కెట్లోకి వచ్చిన తర్వాతే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.1.20 లక్షలు పలికే అవకాశముందని మార్కెట్ వర్గాలంటున్నాయి.