Viveka: వివేకా హత్యకేసు విచారణ.. సీబీఐ విచారణ అవసరం లేదన్న అడ్వకేట్ జనరల్!

  • అనుబంధ పిటిషన్ వేసిన వివేకా అర్ధాంగి సౌభాగ్యమ్మ
  • కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్ కు ఆదేశం
  • అప్పటివరకు నివేదిక రూపొందించవద్దని సిట్ కు స్పష్టీకరణ

ఎన్నికల ముందు పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది. అయితే వివేకా కేసును సీబీఐకి అప్పగించాలని టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఇదిలావుంచితే, ఈ కేసుకు సంబంధించే గతంలో వివేకా భార్య సౌభాగ్యమ్మ హైకోర్టులో ఓ పిటిషన్ వేస్తూ, వివేకా హత్య కేసును సీబీఐతో కానీ, స్వతంత్ర సంస్థతో కానీ దర్యాప్తు చేయించాలని కోరారు. ఇప్పుడా పిటిషన్ ను కూడా వీటితో కలిపి విచారించాలని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఆదేశించింది.    

 దీంతో సౌభాగ్యమ్మ అనుబంధ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున ఈ నెల 19 లోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ అడ్వొకేట్ జనరల్ ను కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, ప్రభుత్వం నుంచి కౌంటర్ పిటిషన్ దాఖలు అయ్యేవరకు ఈ కేసులో తుది నివేదిక రూపొందించవద్దంటూ సిట్ ను ఆదేశించింది. అయితే, ఈ కేసులో సిట్ దర్యాప్తు ఆఖరి దశకు చేరుకుందని, ఇటువంటి తరుణంలో సీబీఐకి అప్పగించాల్సిన అవసరంలేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. ఈ కేసు విచారణను ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.

More Telugu News