SA Rehaman: దాడిలో నిజమైన రైతులు లేరు.. విద్యార్థులపై కేసులు పెట్టొద్దు: వైసీపీ నేత ఎస్ఏ రెహమాన్

  • ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడిని ఖండిస్తున్నా
  • విద్యార్థులను చంద్రబాబు రోడ్డెక్కిస్తున్నారు
  • 33 వేల ఎకరాల భూమితో ఈ ప్రభుత్వానికి సంబంధమేమిటి?

చినకాకాని వద్ద నిన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడిని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ ఖండించారు. ఆ దాడిలో నిజమైన రైతులు ఎవరూ పాల్గొనలేదని అన్నారు. విద్యార్థులపై కేసులు పెట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. విద్యార్థులు రోడ్డెక్కితే అరెస్ట్ చేస్తామని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు హెచ్చరించారని... ఇప్పుడు ప్రతిపక్ష నేతగా విద్యార్థులను రోడ్డెక్కిస్తున్నారని మండిపడ్డారు. గతంలో విద్యార్థి సంఘాలను రద్దు చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనని అన్నారు.

టీడీపీ హయాంలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాల భూమితో ఈ ప్రభుత్వానికి సంబంధమేమిటని రెహమాన్ ప్రశ్నించారు. పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. రాజధాని ఎక్కడుండాలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని బీజేపీ నేతలే చెబుతున్నారని గుర్తు చేశారు.

More Telugu News