మంత్రి కేటీఆర్ ను కలిసిన న్యూజిలాండ్ మహిళా ఎంపీ

08-01-2020 Wed 14:19
  • హైదరాబాద్ వచ్చిన న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక
  • కేటీఆర్ తో భేటీ
  • ట్విట్టర్ లో వెల్లడించిన కేటీఆర్

న్యూజిలాండ్ చట్టసభల్లో భారతీయుల ప్రాతినిధ్యం కూడా ఉంది. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిలాండ్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆమె తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. దీనిపై కేటీఆర్ ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ మహిళా ఎంపీ ప్రియాంక గారిని కలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ, న్యూజిలాండ్ మధ్య అనేక ఒప్పందాల కోసం చర్చించామని కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రియాంకను సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.

కాగా, ప్రియాంక గత దసరా ఉత్సవాల సందర్భంగా న్యూజిలాండ్ లో బతుకమ్మ వేడుకల్లోనూ పాల్గొన్నారు. తెలంగాణ చేనేత కార్మికులు రూపొందించిన ప్రత్యేకమైన చీరను ధరించి బతుకమ్మ సంబరాలకు హాజరయ్యారు.

తాజాగా కేటీఆర్ తో భేటీపై ప్రియాంక కూడా స్పందించారు. కేటీఆర్ తో సమావేశాన్ని ఎంతో ఆస్వాదించానని తెలిపారు. కేటీఆర్ ఎంతో సహృదయుడని, తమ మధ్య ఆహ్లాదకరమైన సంభాషణలు చోటుచేసుకున్నాయని వివరించారు. భారత రాజకీయ వ్యవస్థపైనా, అగ్రి టెక్నాలజీ, ఆవిష్కరణలు, స్టార్టప్ లు తదితర అంశాలపై చర్చించామని వెల్లడించారు. అంతేకాకుండా, న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ నాయకత్వంపై తామిద్దరికీ ఉన్న అభిమానం గురించి కూడా మాట్లాడుకున్నామని తెలిపారు.