మా మిత్రదేశం భారత్‌ ఎలాంటి చర్యలు చేపట్టినా స్వాగతిస్తాం: ఢిల్లీలో ఇరాన్‌ రాయబారి

08-01-2020 Wed 14:13
  • ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పడంలో భారత్‌  గొప్ప పాత్ర పోషిస్తోంది
  • భారత్‌ ఆసియా ప్రాంతానికి చెందినదే
  • మేము యుద్ధం కోసం ఎదురు చూడట్లేదు

అమెరికా దాడిలో మృతి చెందిన ఇరాన్ సైనిక కమాండర్‌ ఖాసీం సులేమానీ సంతాప సభను భారత్‌లోని ఇరాన్‌ దౌత్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇరాన్‌ రాయబారి అలీ చెగేనీ పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పడంలో భారత్‌ చాలా గొప్ప పాత్ర పోషిస్తోందని ఆయన కితాబునిచ్చారు. భారత్‌ ఆసియా ప్రాంతానికి చెందినదేనని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇతర దేశాలు ఎలాంటి చర్యలు చేపట్టినా స్వాగతిస్తామన్నారు.
 
ముఖ్యంగా తమ మిత్రదేశమైన భారత్‌ ఎలాంటి చర్యలు చేపట్టినా స్వాగతిస్తామని అలీ చెప్పారు. తాము యుద్ధం కోసం చూడట్లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి శాంతి, శ్రేయస్సునే కోరుకుంటున్నామని తెలిపారు. ఆత్మ రక్షణ హక్కుల కిందే అమెరికాపై తమ దేశం ప్రతిచర్యకు దిగిందన్నారు.