బైకుపై వెళ్తోన్న కుక్కకు కూడా హెల్మెట్‌.. వీడియో వైరల్

08-01-2020 Wed 13:54
  • తమిళనాడులో ఘటన
  • కుక్కకు హెల్మెట్ పెట్టి తీసుకెళ్లిన ద్విచక్రవాహనదారుడు
  • నెటిజన్ల ప్రశంసలు

ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో హెల్మెట్  పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తోంటే చాలా మంది పట్టించుకోరు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. అటువంటిది తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్తోన్న సమయంలో తాను హెల్మెట్ పెట్టుకోవడమే కాకుండా తన వెనుక కూర్చున్న కుక్కకు కూడా హెల్మెట్ పెట్టాడు.
 
తాను పెంచుకుంటోన్న కుక్కకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఆ ద్విచక్ర వాహనదారుడు తీసుకున్న జాగ్రత్తలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. శునకం హెల్మెట్‌ ధరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసైనా హెల్మెట్ పెట్టుకోని వారు మారతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.