కశ్మీర్ పై నా ఉద్దేశం అది కాదు: రచయిత మెహక్ మీర్జా ప్రభు

08-01-2020 Wed 13:02
  • జాతి సమైక్యత దెబ్బతీయాలన్నది కాదు
  • ఆంక్షలు లేని కశ్మీర్ కావాలని నా ఉద్దేశం 
  • అంతమాత్రానికి కేసులతో వేధింపులు అన్యాయం

'ఫ్రీ కశ్మీర్' అంటే ఆంక్షలు లేనటువంటి కశ్మీర్ అని తన ఉద్దేశమని, అంతే తప్ప జాతి సమైక్యత దెబ్బతీసే ఉద్దేశం కాదని ముంబయికి చెందిన యువతి, రచయిత కూడా అయిన మెహక్ మీర్జా ప్రభు స్పష్టం చేశారు. 'నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా 153బీ కింద కేసు నమోదు చేసి వేధించడం అన్యాయం' అని వాపోయింది. 

రెండు రోజుల క్రితం ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దుండగులు చొరబడి విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ముంబయి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద కూడా కొంతమంది విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న  మెహక్ మీర్జా ప్రభు 'ఫ్రీ కశ్మీర్' అన్న ప్లకార్డు ప్రదర్శించారు. ఇది కాస్తా వివాదమై కూర్చుంది.

ఆమె వ్యవహార శైలి దేశ సమైక్యతను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ పోలీసులు ఆమెపై 153బీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై మెహక్ మీర్జా ప్రభు  స్పందిస్తూ 'ఆ రోజు రాత్రి 7.30 గంటల సమయంలో నేను గేట్ వే వద్దకు వెళ్లాను. కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇది వారి భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనన్నది నా భావన. అక్కడ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని తెలియజేయాలనుకున్నాను. ఆ సమయంలో అక్కడ పడివున్న 'ఫ్రీ కశ్మీర్' అని రాసివున్న ప్లకార్డు నన్ను ఆకర్షించింది. దీంతో దాన్ని చేతుల్లోకి తీసుకుని అనాలోచితంగా ప్రదర్శించాను అంతే' అంటూ మెహక్ మీర్జా ప్రభు చెప్పుకొచ్చారు.

దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. 'నిరసన జరిగేది ఒక అంశంపై. మరి అక్కడకు కశ్మీర్ అంశానికి చెందిన ప్లకార్డు ఎలా వచ్చింది? ముంబయిలో వేర్పాటు వాదులకు స్థానం ఎవరు ఇచ్చారు? సీఎం ఉద్ధవ్ నేతృత్వంలోనే దేశ వ్యతిరేక శక్తులు పుట్టుకొచ్చాయా?' అంటూ ఘాటుగా విమర్శించారు.