అంబులెన్స్‌ వస్తోంది.. దానికి దారి ఇవ్వకండి: బీజేపీ పశ్చిమ బెంగాల్ చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్

08-01-2020 Wed 11:57
  • సీఏఏకు మద్దతుగా బీజేపీ ర్యాలీ
  • అదే సమయంలో వచ్చిన అంబులెన్సు
  • ఆ అంబులెన్సును టీఎంసీ పంపిందని దిలీప్ ఘోష్‌ వ్యాఖ్య

ఎంతటి భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ అంబులెన్సుకి ఆందోళనకారులు దారి ఇచ్చి మానవత్వం చాటుతారు. అయితే, కొందరు రాజకీయ నేతలు మాత్రం మనిషి ప్రాణం కన్నా తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా తాజగా పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో భారతీయ జనతా పార్టీ నిన్న ఓ సభను నిర్వహించింది. బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌  ర్యాలీలో ప్రసంగిస్తూ అంబులెన్సుకు దారి ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు.

ర్యాలీ నేపథ్యంలో రహదారిపై బీజేపీ కార్యకర్తలు  వందల సంఖ్యలో ఉండగా ఓ అంబులెన్స్‌ వచ్చింది. దీంతో ఆ అంబులెన్స్‌కు దారి ఇవ్వొద్దని దిలీప్ ఘోష్ కార్యకర్తలకు సూచించి, దాన్ని వెనక్కి తిప్పి పంపండని ఆదేశించారు. తమ ర్యాలీకి ఆటంకం కలిగించేందుకే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆ అంబులెన్స్‌ను పంపిందని అన్నారు. ఇందుకు సంబంధించి వీడియో మీడియాకు చిక్కింది.