cyber crime: అందం, ఆరోగ్యం పేరుతో ఎర... పడితే విలవిల: నైజీరియన్ల నయా మోసం

  • ప్రేమ, వ్యాపారం పేరుతో మెసేజ్ లు 
  • నమ్మిన వారి జేబు గుల్ల చేయడమే 
  • బాధితుల ఫిర్యాదుతో ఇద్దరి అరెస్టు

సైబర్ నేరాలకు పెట్టింది పేరు నైజీరియన్లు. రకరకాల ఎత్తుగడలతో మోసం చేయడంలో అందెవేసిన చేయి. తాజాగా అందం, ఆరోగ్యం, వ్యాపార చిట్కాలు ప్రయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. బాధితుల మోసంతో నిఘా పెట్టిన సైబర్ క్రైం పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి నుంచి ఆరు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.

 పోలీసుల కథనం మేరకు...సికింద్రాబాద్ కు చెందిన ఓ యువకుడి ఫేస్ బుక్ కి అందమైన యువతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఏక్సెప్ట్ చేస్తే చాటింగ్ మొదలయ్యింది. 'నేను లండన్ రాజకుటుంబం వారసురాలిని. రోజా వూవంత అందంగా ఉంటాను. పైగా కోట్ల డాలర్ల ఆస్తి ఉంది. కాకపోతే న్యాయపరమైన చిక్కుల వల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉంది' అంటూ చాట్ చేసేది. తన గురించి ఆ యువతి ఫ్రాంక్ గా చెబుతోందని నమ్మేశాడు ఆ యువకుడు.

కొన్నాళ్ల తర్వాత తన ఆస్తులకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయని, కోట్ల ఆస్తి చేతికి వచ్చిందని, ఈ సంతోష సమయంలో నీకో బహుమతి పంపిస్తున్నానంటూ మెసేజ్ వచ్చింది. కాకపోతే ఆ బహుమతి విడిపించుకునేందుకు కొంత మొత్తం చెల్లించాలంటూ నిబంధన పెట్టింది.

ఖరీదైన బహుమతి కదా, కొంత మొత్తం పోతే ఏంలే అని సదరు యువకుడు లక్షా 20 వేలు మెయిల్ పెట్టిన బ్యాంకు ఖాతాకు జమ చేశాడు. వాస్తవానికి ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది, మెయిల్ పెట్టింది జేమ్ ఒబాసీ అనే నైజీరియన్. నిజంగానే అమ్మాయి అనుకుని సికింద్రాబాద్ యువకుడు బోల్తా పడ్డాడు. విషయం తెలిసాక పోలీసులను ఆశ్రయించాడు.

లక్కీఓజా మరో నైజీరియన్ మోసగాడు. లండన్లో ఉంటున్న సరోలిన్ అనే యువతి పేరుతో ఫేస్ బుక్ ఖాతా తెరిచాడు. అంబర్ పేటకు చెందిన ఓ వ్యక్తితో ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ మొదలు పెట్టాడు. కొన్నాళ్ల చాటింగ్ తర్వాత భారత్ లో 'విటోలిన్' అనే నొప్పి నివారిణి మందు దొరుకుతుందని, దాన్ని కొని లండన్ కు పంపితే లీటర్ లక్షల్లో అమ్ముడవుతుందని ఆశ పెట్టాడు.

దీంతో నిజమనుకున్న సదరు యువకుడు ఆ నూనె ఎక్కడ దొరుకుతుందని ఆడగగా ఓ అడ్రస్ చెప్పాడు. ఆ అడ్రస్ కు 97,500లు ఆన్ లైన్లో చెల్లించి ఐదు సీసాలు కొన్నాడు. అనంతరం లక్కీ ఓజాను సంప్రదించగా వాటిని తీసుకుని ఢిల్లీ రమ్మన్నాడు. ఢిల్లీ వెళ్లాక లక్కీ ఓజానే 'మార్క్' పేరుతో సదరు యువకుడిని పరిచయం చేసుకుని నూనె తీసుకున్నాడు.

తాడు లండన్ నుంచి వచ్చానని, తనకు మరో 35 బాటిళ్లు కావాలని కోరాడు. మొదటి ఐదు బాటిళ్లకు మంచి లాభం రావడంతో ఈసారి సదరు కం పెనీకి ఆన్ లైన్లో 6,82,500 జమచేసి బాటిళ్లకు ఆర్డర్ ఇచ్చాడు. అనుకున్న సమయానికి బాటిళ్లు రాకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది.

తాను మోసపోయానని గుర్తించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వలపన్ని నైజీరియన్లలో ఒకరిని హైదరాబాద్ లో, మరొకరిని ఢిల్లీలో అరెస్టు చేశారు.

More Telugu News