సంతోషం.. ఇప్పటికైనా టీటీడీ మంచి నిర్ణయం తీసుకుంది: ఐవైఆర్ కృష్ణారావు

08-01-2020 Wed 09:51
  • టీటీడీని బాదేస్తున్నారంటూ ఓ పత్రికలో కథనం
  • ఇది తప్పుదోవ పట్టించే కథనం అన్న ఐవైఆర్
  • పెద్ద దేవాలయాలకు నిధులు ఇవ్వడమనేది టీటీడీ నిబంధనల్లో ఉందంటూ వ్యాఖ్య

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కు చెందిన నిధులను ఇతర ప్రభుత్వ కార్యకలాపాలకు మళ్లిస్తున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. 'టీటీడీని బాదేస్తున్నారు' అనే కథనంతో వచ్చిన ఈ వార్తలో... శ్రీవారికి భక్తులు సమర్పించిన విరాళాలను తిరుమల ఆధ్వర్యంలోని సంస్థలు, సేవలకు ఖర్చు చేయాల్సి ఉండగా... తనకు సంబంధం లేని ప్రభుత్వ కార్యకలాపాలకు టీటీడీ తరలిస్తోందని సదరు పత్రిక పేర్కొంది. ముఖ్యంగా దేవాదాయశాఖకు పెద్ద ఎత్తున నిధులను మళ్లించడాన్ని తప్పుబట్టింది.

ఈ వార్తపై ఐవైఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే వార్త అని అన్నారు. దేవాదాయశాఖ కింద చిన్న దేవాలయాలకు, అర్చకులకు సహాయం కోసం ట్రస్టులు ఉన్నాయని చెప్పారు. మిగిలిన ఇతర పెద్ద దేవాలయాలకు నిధులు ఇవ్వడమనేది టీటీడీ నిబంధనల్లోనే ఉందని తెలిపారు. అయితే, ఈ నిబంధనను టీటీడీ ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉంటుందని... ఈసారైనా తగిన విధంగా నిధులు ఇవ్వాలని నిర్ణయించడం సంతోషకరమని చెప్పారు.