అమెరికా, ఇరాన్ లపై హీరో నిఖిల్ కామెంట్

08-01-2020 Wed 09:38
  • మీరిద్దరూ ఈ గ్రహం మీద నుంచి వెళ్లిపోండి
  • మీ యుద్ధం ఇతరులకు అవసరం లేదు
  • పర్యావరణం, ప్రశాంతతను మరింత చెడగొట్టొద్దు

తమ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీని హతమార్చిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్ లు లక్ష్యంగా క్షిపణి దాడులను నిర్వహించింది. అసద్, ఇర్బిల్ ఎయిర్ బేస్ లపై డజనుకు పైగా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడులను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ధ్రువీకరించింది. అయితే, ఈ దాడుల వల్ల అమెరికా సైనికులకు జరిగిన నష్టంపై ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో, అమెరికా ఎలాంటి చర్యలు చేపట్టబోతోందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

మరోవైపు, ఈ దాడులపై సినీ హీరో నిఖిల్ అసహనం వ్యక్తం చేశాడు. తన వ్యతిరేకతను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 'డియర్ అమెరికా, ఇరాన్... మీరిద్దరూ యుద్ధం చేసుకోవాలనుకుంటే ఈ గ్రహం (భూమి) మీద నుంచి వెళ్లిపోయి బాంబులు విసురుకోండి. ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు మీ యుద్ధం అవసరం లేదు. ఇప్పటికే నాశనమైన పర్యావరణం, ప్రశాంతతను మీ యుద్ధాలతో మరింత చెడగొట్టకండి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.