మరణశిక్షలు పడుతున్నా.. అమలవుతున్నది మాత్రం కొందరికే!

08-01-2020 Wed 09:22
  • కేవలం ఒక శాతం అంటే.. నలుగురికి మాత్రమే అమలు
  • సుదీర్ఘ విచారణలు, రాష్ట్రపతికి క్షమాభిక్షల కారణంగా శిక్ష అమలులో జాప్యం
  • ఉరిశిక్ష తప్పించుకుని జీవిత ఖైదు అనుభవిస్తున్న 1200 మంది

గత 15 ఏళ్లలో దేశంలో మొత్తం 400 మందికి వివిధ కోర్టులు మరణశిక్షలు విధించగా అందులో కేవలం ఒక శాతం మందికి మాత్రమే శిక్షలు అమలైనట్టు జాతీయ నేర విభాగం (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలను బట్టి తెలుస్తోంది. అంతేకాదు, మరణశిక్ష కేసుల్లో దాదాపు 1200 మందికి అది ఆ తర్వాత జీవిత ఖైదుగా మారింది. నిర్భయ నిందితులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో ఎన్‌సీఆర్‌బీ గణాంకాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కోర్టులో సుదీర్ఘకాల విచారణ, రాష్ట్రపతి అభ్యర్థనలు కారణంగానే శిక్షల అమలులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఇక గత 15 ఏళ్లలో ఉరితీతకు గురైన వారు ఎవరంటే.. బాలికపై అత్యాచారం కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ధనుంజయ్‌కి 14 ఆగస్టు 2004 అలీపూర్ జైలులో ఉరిశిక్ష అమలు చేశారు. అప్పటికి అతడి వయసు 42 ఏళ్లు. రెండో వ్యక్తి పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్. 26 నవంబరు 2008న ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో కీలక పాత్రధారి అయిన కసబ్‌ను 21 నవంబరు 2012లో పూణెలోని ఎరవాడ జైలులో ఉరితీశారు.

ఉరిశిక్షకు గురైన మూడో వ్యక్తి అఫ్జల్ గురు. భారత పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు సహకరించినందుకు గాను 9 ఫిబ్రవరి 2013న తీహార్ జైలులో ఉరితీశారు. నాలుగో వ్యక్తి యాకూబ్ మెమన్. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబుదాడులకు కారకుడైన ఇతడిని 30 జులై 2015న నాగ్‌పూర్ జైలులో ఉరి తీశారు. ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరితీస్తే ఈ సంఖ్య 8కి పెరుగుతుంది.