దగ్గరైన తరువాత మోసం చేశాడన్న కోపంతో... సొంత బావ గొంతుకోసిన యువతి!

08-01-2020 Wed 09:06
  • విశాఖ సమీపంలోని కంచరపాలెంలో ఘటన
  • గతంలో ప్రేమించుకున్న యువకుడు, యువతి
  • పెళ్లయినా, వేధించిన యువకుడు
తనను ప్రేమించాడని చెప్పిన మేనబావ, అత్యంత సన్నిహితుడై, పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆపై మోసం చేశాడన్న ఆగ్రహంతో ఓ యువతి అతని గొంతును బ్లేడ్ తో కోసింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గతంలో నిందితురాలు, ఆ యువకుడు ప్రేమించుకున్నారని, అయితే, ఆ యువకుడికి మరో అమ్మాయితో వివాహం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

అయితే, నిందితురాలి కథనం మరోలా వుంది. ఇప్పటికే బావ ఇంకో పెళ్లి చేసుకున్నా, తానే కావాలంటూ నిత్యమూ తన వెంటపడుతున్నాడని, దానిని తట్టుకోలేకే దాడి చేశానని యువతి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సదరు యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. కేసును లోతుగా దర్యాఫ్తు చేస్తామని, పెళ్లయి కూడా వేధించినట్టు తేలితే, యువకుడిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.