ఏపీలో పెరగనున్న విద్యుత్ చార్జీలు.. రేపటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

08-01-2020 Wed 08:11
  • విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదన
  • ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్న అధికారులు
  • విజయవాడ, కడప, తిరుపతిలలో ప్రజాభిప్రాయ సేకరణ

త్వరలోనే ఏపీలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. చార్జీల పెంపు ప్రతిపాదనపై రేపటి నుంచి మూడు రోజులపాటు బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్టు ఏపీ ఎన్సీ డీసీపీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు తెలిపారు. 9న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో, 10న కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో, 11న తిరుపతి ఎస్పీడీసీఎల్ సమావేశ మందిరంలో చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు.

ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి  2 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్టు హరనాథరావు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్న అనంతరం చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన పేర్కొన్నారు.