బీసీజీ నివేదికలో ఆ పేర్లు కూడా తప్పు రాశారు!: నారా లోకేశ్ విసుర్లు

07-01-2020 Tue 22:02
  • బీసీజీ నివేదికలో ‘అమరావతి, విశాఖపట్టణం’ పేర్లు తప్పు రాశారు
  • ఎలా అభివృద్ధి చేయాలో వీళ్లు చెబుతారట
  • అది హైపవర్ కమిటీ కాదు నో పవర్ కమిటీ

ఏపీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై ప్రతిపాదనలు చేస్తూ ఇచ్చిన బీసీజీ నివేదికపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు విమర్శలు చేశారు. తోట్లవల్లూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీసీజీ నివేదికలో ‘అమరావతి, విశాఖపట్టణం’ పేర్లు తప్పుగా రాశారు, ఇక నేనేమి చెబుతాను? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

స్పెల్లింగ్ సరిగా రాయడం రాని వాళ్లు మన రాష్ట్రాన్ని ఎలా నడిపించాలో, ఎట్లా అభివృద్ధి చేయాలో చెబుతున్నారు మనకు, ‘అదీ జగన్మోహన్ రెడ్డి గారు!’ అంటూ సెటైర్లు వేశారు. హైపవర్ కమిటీలో ఉన్న సభ్యులందరూ వాళ్ల మంత్రులే, ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేస్తారు. ‘జగన్ నుంచో మంటే నుంచుంటున్నారు. కూర్చోమంటే కూర్చుంటున్నారు’ అని విమర్శలు చేశారు. ఏం హైపవర్ ఉంది? నో పవర్ కమిటీ’ అంటూ విమర్శలు చేశారు.

‘మాట తప్పం, మడం తిప్పం’ అన్న వ్యక్తి ’అన్నీ తప్పాడు.. తిప్పాడు’ అంటూ జగన్ పై  విమర్శలు చేశారు. ‘ఆయన (జగన్) రాత్రి ఆరింటికల్లా వెళ్లి పడుకుంటాడు. రెండు మూడు గంటలు వీడియో గేమ్ లు ఆడతాడు.. పడుకుంటాడు. వీడియో గేమ్ ల ముఖ్యమంత్రి.. ఆ వీడియో గేమ్ లను తీసుకొచ్చి ప్రజలపైనా ప్రయోగిస్తున్నాడు. ఇంకేం చెబుతాం..అలా ఉంది పరిస్థితి’ అని జగన్ పై విమర్శలు చేశారు.