నిర్భయ దోషుల ఉరితీతకు బీహార్ నుంచి తాళ్లు

07-01-2020 Tue 21:13
  • మీరట్ నుంచి తలారీ రాక?
  • తీహార్ జైల్లో ఉరితీతకు  ఏర్పాట్లు
  • అప్జల్ గురు ఉరితీతకు వాడినది బీహార్ తాడే
నిర్భయ దోషులకు పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడంతో వారిని ఉరి తీయడానికి ఢిల్లీలోని తీహార్ జైలు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఉరితీతకు కావలసిన ఉరితాళ్లను, తలారీని ఏర్పాటు చేస్తున్నారు. తీహార్ జైలు ఉన్నతాధికారి ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ‘నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మీరట్ కు చెందిన ఓ తలారిని సిద్ధం చేస్తున్నాం’ అని చెప్పారు.

దోషులు నలుగురిని జైల్లో ఒక్కో సెల్ లో ఉంచి వారిని సీసీ టీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఉరిశిక్ష అమలుకు కావాల్సిన ప్రత్యేకమైన తాళ్లను బీహార్ లోని బక్సర్ జైలు నుంచి తెప్పించినట్లు సమాచారం. పార్లమెంట్ పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురును ఉరితీసేందుకు ఈ జైలు నుంచి తీసుకొచ్చిన తాడునే ఉపయోగించిన విషయం తెలిసిందే.