కోర్టు హాల్లో నిర్భయ మాతృమూర్తిని ప్రాధేయపడిన దోషి ముఖేశ్ సింగ్ తల్లి!

07-01-2020 Tue 20:37
  • నిర్భయ దోషులకు మరణశిక్ష ఖరారు
  • కోర్టులో ఆశ్చర్యకర సన్నివేశం
  • తన బిడ్డను క్షమించాలని నిర్భయ తల్లిని కోరిన ముఖేశ్ సింగ్ తల్లి

నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 22న నలుగుర్నీ ఉరి తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ విచారణ సందర్భంగా కోర్టు హాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. విచారణ కొనసాగుతున్న సమయంలో దోషి ముఖేశ్ సింగ్ తల్లి నేరుగా నిర్భయ తల్లి వద్దకు వెళ్లింది.

 "నా కొడుకు జీవితం మీ చేతుల్లో ఉంది... క్షమాభిక్ష పెట్టండి" అంటూ నిర్భయ తల్లిని వేడుకుంది. దాంతో నిర్భయ తల్లి ఘాటుగా స్పందించారు. తనకూ ఓ బిడ్డ ఉండేదని, ఆమె పట్ల జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఎలా క్షమాభిక్ష పెట్టాలి? అని ప్రశ్నించారు. "నా బిడ్డకు న్యాయం కోసం ఏడేళ్లుగా పోరాడుతున్నాం" అంటూ వ్యాఖ్యానిస్తుండగా జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. "నిశ్శబ్దంగా ఉండండి" అంటూ గట్టిగా అనడంతో అందరూ మౌనం వహించారు.