చరిత్రలో జరిగినవి విశ్లేషించాం.. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం: ఏపీ మంత్రి బుగ్గన

07-01-2020 Tue 19:55
  • ముగిసిన హైపవర్ కమిటీ సమావేశం
  • మూడు గంటల పాటు సమావేశం
  • కమిటీల నివేదికలపై ప్రాథమికంగా చర్చించామన్న బుగ్గన

ఏపీ రాజధాని మార్పు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి తదితర అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఉద్దేశించిన హైపవర్ కమిటీ విజయవాడలో సమావేశమైన సంగతి తెలిసిందే. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దీనిపై మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై ప్రాథమికంగా మాత్రమే చర్చించామని వెల్లడించారు. చరిత్రలో జరిగినవి విశ్లేషించామని, నిర్ణయం తీసుకునే క్రమంలో అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. మరో మంత్రి కన్నబాబు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తదుపరి సమావేశాల్లో మరింత లోతుగా చర్చించి సీఎంకు నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.