Amaravati: ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా బయట తిరగట్లేదు.. భయపడిపోయారు: నారా లోకేశ్

  • పిన్నెల్లి వాహనంపై దాడి ఘటనపై లోకేశ్ ప్రస్తావన
  • పక్కనుంచి వెళ్లమని ఆయనకు ఓ రైతు దండం పెట్టాడు
  • ఎమ్మెల్యే సిబ్బంది ఆ రైతును మెడపట్టి తోసేశారు

టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు సంఘీభావం తెలపకూడదన్న లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. తోట్లవల్లూరు పీఎస్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో లోకేశ్ మాట్లాడుతూ, చినకాకానిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ, రోడ్డుపైకి రైతులు స్వచ్ఛందంగా వచ్చారని, అందుకు సంబంధించిన వీడియో చూస్తే తనకే ఆశ్చర్యం కలిగిందని అన్నారు.

ఎమ్మెల్యేకు ఓ రైతు దండం పెట్టి.. ‘అయ్యా, మీరు ఇటు నుంచి వద్దు, పక్క నుంచి వెళ్లండి’ అని చెబితే ఎమ్మెల్యే సిబ్బంది ఆ రైతు మెడ పట్టుకుని పక్కకు తోసేశారని అన్నారు. ఏం తప్పు చేశాడు రైతు? భూమి ఇచ్చినందుకు తప్పుచేశాడా? ఈ రెండు జిల్లాల్లో తొంభై శాతం సీట్లు మీకే (వైసీపీ) వచ్చాయిగా, ఇట్లాగా, మీరు రుణం తీర్చుకునేది? ఏం ఎమ్మెల్యేలు మీరు? ఒక్క ఎమ్మెల్యే కూడా బయట తిరగట్లేదు.. భయపడిపోయారు’ అంటూ విమర్శించారు. రైతులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అయిపోయారంటూ ఓ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, వారిని కించపరిచేలా మాట్లాడుతున్నందుకు సిగ్గుందా? అంటూ లోకేశ్ మండిపడ్డారు.

More Telugu News