Andhra Pradesh: ఏపీలో వేద పాఠశాలలకు త్వరలో మహర్దశ: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

  • వెల్లంపల్లిని కలిసిన అర్చక అకాడమీ డైరెక్టర్ కృష్ణ శర్మ
  • వేద పాఠశాలలకు చేపట్టాల్సిన చర్యలపై వినతి 
  • సానుకూలంగా స్పందించిన వెల్లంపల్లి

ఏపీలో వేద, ఆగమ పాఠశాలలకు మహర్దశ పట్టేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర విజయవాడ చేరుకున్నారు. ఆయన సమక్షంలో అర్చక అకాడమీ డైరెక్టర్ కృష్ణ శర్మ ఇవాళ వెల్లంపల్లిని, ఎమ్మెల్యే మల్లాది విష్ణును కలిశారు.

వేద పాఠశాలల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ వినతిపత్రాన్ని పరిశీలించిన వెల్లంపల్లి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణాత్మక చర్యల ద్వారా వేద విద్యాభ్యాసాన్ని ప్రక్షాళన చేసేందుకు, ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు.

వినతి పత్రంలోని అంశాలు

వేద, ఆగమ పాఠశాలల్లో ఒకే సిలబస్ ఉండాలని పరీక్షా విధానం రాష్ట్రం అంతటా ఒకే విధంగా సాగాలని, వేద, ఆగమ పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలని, ప్రతి 3, 6, 12 నెలలకు పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వేద పాఠశాలల్లో బ్రాహ్మణ కేర్ టేకర్స్ ను నియమించాలని, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం విద్యార్థులను ఆగమ దేవాలయాలకు తీసుకువెళ్లి అర్చన, ఉత్సవాదులందు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా కృషి చేయాలని, వేద పాఠశాలల్లో ప్రత్యేక వంటశాలలను ఏర్పాటు చేయాలని, వేద విద్యార్థులకు ప్రతి మూడు నెలలకోసారి రెండు జతల బట్టలు పంపిణీ చేయాలని, స్మార్త, ఆగమ విద్యార్థులు సుష్క ప్రయోగం నేర్పించే విధంగా చర్యలు అవసరమని ఆ వినతిపత్రంలో కోరారు.

More Telugu News