రాష్ట్రంలో అస్థిరత్వం సృష్టించడానికి చంద్రబాబు చేసిన మరో ప్రయత్నమే ఇది: విజయసాయిరెడ్డి

07-01-2020 Tue 17:52
  • ఏపీ రాజధాని అమరావతిలో ఉద్రిక్తత
  • రైతుల ఆందోళన తీవ్రతరం
  • చినకాకాని వద్ద పిన్నెల్లిపై దాడి

ఏపీ రాజధాని రగులుతోంది. ఓవైపు రైతుల ఆందోళనలు, మరోవైపు అరెస్టులతో అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. ఈ మధ్యాహ్నం ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆందోళనకారులు చినకాకాని వద్ద దాడికి యత్నించిన ఘటన అధికార, విపక్షాల మధ్య తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. పిన్నెల్లిపై టీడీపీ గూండాలు పిరికిపందల్లా దాడికి పాల్పడడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. ఈ దాడికి పాల్పడింది టీడీపీ గూండాలైతే, ఆ నిందను అమాయక రైతులపై మోపడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్రిక్తతను, అస్థిరతను సృష్టించేందుకు చంద్రబాబు చేసిన మరో ప్రయత్నమే ఇది అని విజయసాయి ట్వీట్ చేశారు.