జేఎన్ యూ ఘటన.. ప్రజాస్వామ్యానికే మచ్చ: సీపీఐ నారాయణ

07-01-2020 Tue 17:43
  • ఇది ఆటవిక చర్య.. కేంద్రం చర్యలు చేపట్టాలి
  • సార్వత్రిక సమ్మెకు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు పలకాలి
  • కేసీఆర్ ఢిల్లీలో కాళ్లు మొక్కి..ఇక్కడికి వచ్చి మీసాలు తిప్పుతాడు

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులపై దుండగులు దాడిచేసిన ఘటనపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులపై దాడిని ఆటవిక చర్యగా ఆయన అభివర్ణించారు. కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.  ప్రజాస్వామ్యానికి ఇది సిగ్గుచేటంటూ.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షాను, ఆర్ఎస్ఎస్ ను విమర్శించారు.

అమిత్ షాది క్రిమినల్ ఇంటెలిజెన్స్ అని వ్యాఖ్యానించారు. సార్వత్రిక సమ్మెకు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీలో కాళ్లు మొక్కుతాడు.. ఇక్కడికి వచ్చి మీసాలు తిప్పుతాడంటూ విమర్శించారు. కార్మిక, ఉద్యోగ, కర్షక సంఘాల పిలుపు మేరకు రేపు నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నారాయణ పేర్కొన్నారు.