హైదరాబాదులో ఉన్మాది దుశ్చర్య... అందరూ చూస్తుండగా బిచ్చగాడి హత్య

07-01-2020 Tue 15:43
  • సైదాబాద్ దోబీఘాట్ సిగ్నల్స్ వద్ద ఘటన
  • రోడ్డుపై సైకో స్వైరవిహారం
  • బిచ్చగాడి మెడకు గుడ్డ చుట్టి హత్య

హైదరాబాదులో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై ఓ ఉన్మాది పట్టపగలే హత్య చేయడం ఒళ్లు గగుర్పొడుస్తోంది. అది కూడా తన పాటికి తాను బిచ్చమెత్తుకుంటున్న ఓ అభాగ్యుడ్ని ఉత్తిపుణ్యానికే పొట్టనబెట్టుకున్నాడు. సైదాబాద్ ప్రాంతంలోని దోబీఘాట్ జంక్షన్ వద్ద ఈ ఘోరం చోటుచేసుకుంది. ఓ సైకో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ రోడ్డుపై వస్తుండగా, అక్కడే సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తున్న వ్యక్తి కనిపించాడు. వెంటనే ఆ బిచ్చగాడి మెడకు గుడ్డ చుట్టి గట్టిగా బిగించి చంపేశాడు. జనాలందరూ చూస్తుండగానే ఆ బిచ్చగాడు విగతజీవిగా మారాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.