ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి చేసింది వీరే: రోజా

07-01-2020 Tue 15:14
  • టీడీపీ రౌడీలు, గూండాలే దాడి చేశారు
  • భూములను కాపాడుకోవడానికి చంద్రబాబు దిగజారిపోయారు
  • అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్ భావిస్తున్నారు

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై అమరావతి రైతులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనను వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యేలపై దాడి చేయాల్సిన అవసరం అమరావతి రైతులకు లేదని... ఈ దాడులకు పాల్పడుతున్నది టీడీపీ రౌడీలు, గూండాలేనని అన్నారు. దీని పర్యవసానాలను టీడీపీ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తన భూములు, తన బినామీ భూములను కాపాడుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారిపోయారని... తన భార్యను కూడా తీసుకొచ్చి అమరావతి రైతుల మధ్య కూర్చోబెట్టారని రోజా దుయ్యబట్టారు. ఆమె చేత రెండు బంగారు గాజులను విరాళం ఇప్పించడాన్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబేనని రోజా విమర్శించారు. అమరావతిపై ఎంతో ప్రేమ ఉందని చెబుతున్న చంద్రబాబు... రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజధానిపై ప్రేమ ఉన్నట్టు తన అనుకూల మీడియాలో గగ్గోలు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని చెప్పారు.