తన కారు అద్దాలను పగలగొట్టడంపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి స్పందన

07-01-2020 Tue 14:43
  • దాడి చేసింది అమరావతి రైతులు కాదు
  • టీడీపీ వారే దాడి చేశారు
  • రైతులపై మాకు సానుభూతి ఉంది

వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈరోజు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. చినకాకాని వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై ఆందోళనకారులు దాడి చేశారు. కారు అద్దాలను పగలగొట్టారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసుల అండతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పిన్నెల్లి స్పందించారు.

మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో తాను విజయవాడకు వెళ్తున్నానని... హైవేపై ధర్నా చేస్తుండటంతో, తాను సర్వీసు రోడ్డులో వెళ్తున్నానని పిన్నెల్లి చెప్పారు.  50 మంది మద్యం తాగి వచ్చారని... తన వాహనం ముందుకు వెళ్లకుండా, వెనక్కి వెళ్లకుండా రెండు కార్లు అడ్డం పెట్టారని... ప్రశ్నించిన తమ గన్ మెన్లపై కూడా దాడి చేశారని తెలిపారు. అద్దాలు పగలగొట్టారని చెప్పారు.

తాను చెబున్నది కూడా వినకుండా దాడి చేశారని అన్నారు. ఇది రాజధాని రైతులు చేసిన దాడి కాదని... టీడీపీ వారు చేసిన పనేనని ఆరోపించారు. రైతులపై తమకు సానుభూతి ఉందని చెప్పారు. రాజధాని రైతులు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ తీసుకుని, చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

తన కారుపై రాళ్లు వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని పిన్నెల్లి అన్నారు. తన కారుపై దాడి చేయడం చాలా దుర్మార్గమైన పని అని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందనే చంద్రబాబు ఇలాంటి దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఇలాంటి దాడులు కాకుండా... చేతనైతే తమపై డైరెక్టుగా దాడులు చేయాలని సవాల్ విసిరారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని అన్నారు. విజువల్స్ లో అన్నీ ఉన్నాయని... జిల్లా ఎస్పీకి ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.