Andhra Pradesh: నాపై వస్తోన్న ఆరోపణలు అవాస్తవం: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

  • సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నా
  • తప్పుచేశానని భావిస్తే రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటా
  • చర్చకు ఎక్కడికి పిలిచినా సరే వస్తా

తనపై వస్తోన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమేనని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు కేటాయించడంలో అవినీతి చోటుచేసుకుందని, కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తనపై కొందరు వ్యక్తులు, కొన్ని ప్రజాసంఘాలు చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు.  

రాయచోటిలో వైసీపీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కళాశాలకు చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది నిజమేనని, కానీ అందులో ఎటువంటి ప్రైవేటు నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. అందరికీ ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నియోజక వర్గ ప్రజల అభీష్టాలకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు చేయమని స్పష్టం చేశారు. తప్పుచేశానని అనుకుంటే స్వచ్ఛందంగా రాజకీయాలనుంచి వైదొలుగుతానని చెప్పారు. ఈ స్థలం వివాదంపై చర్చకు ఎక్కడికి పిలిచినా సరే వస్తానని విమర్శకులకు సవాల్ విసిరారు.

More Telugu News