విజయలక్ష్మి, భారతి గురించి మేము మాట్లాడలేమా? మాకూ నోరుంది: నారా లోకేశ్

07-01-2020 Tue 14:13
  • మా అమ్మ ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు
  • ఆమె గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు
  • మాకు సంస్కారం ఉంది.. అందుకే మాట్లాడటం లేదు

అమరావతి రైతుల కోసం తన రెండు బంగారు గాజులను విరాళంగా ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై నారా లోకేశ్ స్పందిస్తూ, తన తల్లి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని... అలాంటి ఆమె గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయలక్ష్మి, భార్య భారతి గురించి తాము మాట్లాడలేమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకూ నోరు ఉందని... తాము కూడా మాట్లాడగలమని... అయితే, తమకు సంస్కారం ఉందని అన్నారు.

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వారు... కేసులు ఎందుకు పెట్టడం లేదని లోకేశ్ ప్రశ్నించారు. దమ్ముంటే కేసులు పెట్టాలని సవాల్ విసిరారు. రాజధాని కోసం కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ మూడు ముక్కలాటతో పరిశ్రమలన్నీ ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాయని మండిపడ్డారు.