'దర్బార్' చిత్రాన్ని చూసేందుకు సెలవు ప్రకటిస్తున్న చెన్నై ఆఫీసులు

07-01-2020 Tue 12:54
  • ఈ నెల 9వ తేదీన 'దర్బార్' విడుదల 
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు 
  • థియేటర్ల దగ్గర పెరుగుతున్న సందడి  

తమిళనాట రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే అక్కడ అంతా పండుగ వాతావరణం ఉంటుంది. ఇక పండుగ సందర్భంగా ఆయన సినిమా వస్తుందంటే ఆ సందడి మరింతగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి వాతావరణమే తమిళనాట కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి అక్కడ రజనీ సినిమా ఒక్కటే బరిలో ఉండటంతో క్రేజ్ ఒక రేంజ్ లో వుంది.

ఈ నెల 9వ తేదీన 'దర్బార్' సినిమాను ప్రదర్శించనున్న ప్రతి థియేటర్ దగ్గర పెద్దస్థాయిలో హడావిడి కనిపిస్తోంది. థియేటర్లపై హెలికాఫ్టర్ తో పూల వర్షం కురిపించడానికి అభిమానులు అనుమతులు తీసుకుంటున్నారు. ఇక చెన్నైలోని కొన్ని ప్రైవేటు ఆఫీసులవారు 'దర్బార్' రిలీజ్ రోజున సెలవును ప్రకటించారు. మరికొన్ని ఆఫీసుల వారు సెలవును ప్రకటించడమే కాకుండా, ఉద్యోగులకు సినిమా టికెట్లను ఉచితంగా అందజేస్తున్నారట. ఇలా తమిళనాట ఎక్కడ చూసినా 'దర్బార్' గురించిన మాటలే వినిపిస్తున్నాయి .. అభిమానులు చేసే సందళ్లే కనిపిస్తున్నాయి.