పంజాగుట్ట సెంటర్ లో లోకేశ్వరి ఆత్మహత్య కేసు విచారణలో కీలక ముందడుగు!

07-01-2020 Tue 12:18
  • పోలీసు స్టేషన్ ముందు లోకేశ్వరి సూసైడ్
  • ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నిందితుడన్న పోలీసులు
  • ప్రవీణ్ చివరి సిగ్నల్ బెంగళూరులో

హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్య చేసుకున్న లోకేశ్వరి ఉదంతం తీవ్ర కలకలం రేపగా, కేసు విచారణలో పోలీసులు కీలక ముందడుగు వేశారు. తమ దర్యాఫ్తును ముమ్మరం చేసిన పోలీసులు, మృతురాలిని ప్రవీణ్ కుమార్ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వేధించాడని తేల్చారు.

 అతని కోసం గాలిస్తున్నామని, అతని చివరి కాల్ సిగ్నల్ బెంగళూరులో ఉన్నట్టు తేలిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతని ఇంట్లో, అతని బంధువుల ఇంట్లోనూ గాలించినా ప్రయోజనం లేకపోయిందని, అతని బంధువుల్లో అనుమానితులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని తెలిపాయి.

 కాగా, లోకేశ్వరి మృతదేహం పూర్తిగా కాలిపోగా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహానికి కాచిగూడ, విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.