ఇంట్లో చెప్పకుండా వచ్చానన్న మహిళ... భర్తకు ఫోన్ చేసి ఏమీ అనవద్దని కోరిన చంద్రబాబు... వీడియో ఇదిగో!

07-01-2020 Tue 12:08
  • గద్దె రామ్మోహన్ దీక్షకు చంద్రబాబు సంఘీభావం
  • తన భర్త ఏమైనా అంటారేమోనని భయపడిన నాగలక్ష్మి
  • ఫోన్ చేసి, భర్తతో మాట్లాడిన చంద్రబాబు

అమరావతి రైతులకు మద్దతు తెలుపుతూ టీడీపీ నేత గద్దె రామ్మోహన్ నిరసన దీక్షకు దిగిన వేళ, ఆయనకు సంఘీభావం తెలపడానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాగా, ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఆ ఘటన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నిరసనకు వచ్చిన నాగలక్ష్మి అనే మహిళ, తాను ఇంట్లో భర్తకు చెప్పకుండా దీక్షకు వచ్చానని, ఆయన పేరు చంద్రశేఖర్ అని, ఆఫీసుకు వెళ్లారని చెబుతూ, తన భర్తకు మీరే సర్ది చెప్పాలని కోరింది.

ఆ వెంటనే స్పందించిన చంద్రబాబు, ఫోన్ నంబర్ రాసివ్వాలని కోరి, వెంటనే చంద్రశేఖర్ కు ఫోన్ చేశారు. హలో బ్రదర్... నేను చంద్రబాబునాయుడిని అంటూ పరిచయం చేసుకున్నారు. ఇక్కడ ఓ మీటింగ్ కు నాగలక్ష్మి వచ్చారని, మీ పర్మిషన్ లేకుండా వచ్చారని, దీక్షకు సంఘీభావాన్ని తెలిపారని అన్నారు. ఇంతవరకూ తాను భర్త అనుమతి లేకుండా ఎన్నడూ గడప దాటింది లేదని, మొదటిసారి ఆమె ఎమోషన్ లో వచ్చారని, ఓ ఉంగరాన్ని ఉద్యమానికి ఇచ్చారని, మనస్ఫూర్తిగా ఆమెను ఆశీర్వదించి, సహకరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.