గుర్తుండిపోయే పాత్రలు చేయడమే ఇష్టం: హీరోయిన్ అంజలి

07-01-2020 Tue 12:01
  • సీనియర్ స్టార్ హీరోల సరసన నటించాను 
  • 'సీత' పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది
  • బలమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తానన్న అంజలి 

తెలుగులో కథానాయికగా అంజలికి మంచి క్రేజ్ వుంది. బాలకృష్ణ .. వెంకటేశ్ .. రవితేజ వంటి సీనియర్ స్టార్ హీరోలతోనూ ఆమె సినిమాలు చేసింది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అంజలి మాట్లాడుతూ .. "సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడం వలన, యువ కథానాయకుల జోడీగా అవకాశాలు కోల్పోయానని కొంతమంది అంటుంటారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు.

నాకు వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నాను. పది సినిమాలు చేసేయాలని నేను ఆశపడను .. పది సంవత్సరాల పాటు గుర్తుండిపోయే సరైన పాత్ర ఒకటి చేస్తే చాలు అని అనుకుంటాను. అలా అనుకోవడం వల్లనే 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమా చేయగలిగాను. అందులోని 'సీత'పాత్రను ఇంతవరకూ ఎవరూ మరిచిపోలేదు. సినిమాల సంఖ్య కంటే బలమైన పాత్రలు నిలబెడతాయని నేను నమ్ముతాను" అని చెప్పుకొచ్చింది.